WELCOME TO DEAR MANTHANITES,PLS JOIN THIS WEB SITE:మన మంథని information resource centre for entertainment (వినోదం), custom (సంప్రదాయ), cultural (సంస్కృతి), literary (సాహిత్య) and devotional (భక్తి) aspects of all Telugu people. Here you will find some information and devotional Songs. Also included is a separate Bhakti page with collection of all familiar stotras, slokas, pujas and vratas in audio and lyrics format..

Dr. Sujatha Garu


వైద్యానికి వరం
‘వరాల భీమయ్య’ ఈ పేరు చెబితే ఇప్పటికి కరీంనగర్ జిల్లా మంథని ప్రాంత ప్రజలు చేతులు జోడించి నమస్కరిస్తారు. మంథనిలో హైస్కూల్ స్థాపించి అక్కడి వారికి ఉన్నత పాఠశాల విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఆ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఎంతోమంది పేద విద్యార్థులను తన సొంత ఖర్చుతో చదివించి విద్యా వంతులను చేశారు. వరాల భీమయ్య విద్యావేత్తగా ఎంతో మందికి ఆదర్శవూపాయమైన జీవితాన్ని గడిపారు. అటువంటి వరాల వారింటికి పెద్ద కోడలు ఆమె. మామగారి స్ఫూర్తితో సేవాతత్పరతే పరమావధిగా, రోగుల సంక్షేమమే ధ్యేయంగా జీవితం సాగిస్తున్నారు. వైద్యం పూర్తిగా వ్యాపారంగా మారిన ఈరోజుల్లో కూడా అవసరమైన వారికి తన సొంత డబ్బు వెచ్చించి మరీ వైద్యం చేస్తున్నారామె. ఇంటిపేరును సార్థకం చేస్తూ రోగుల పాలిట ‘వరాల’ తల్లిగా మారారామె. విద్యారంగానికి మామగారు చేసిన సేవను అడుగడుగునా స్మరిస్తూ .... తన పరిధిలోని వైద్యరంగంలో ఆమె శక్తి వంచన లేకుండా పేదలకు సేవచేయాలని ఆరాట పడుతున్నారు. ఆమె డాక్టర్ సుజాత.అప్పట్లో పీయూసీలో సాధించిన మెరిట్ ఆధారంగానే వైద్య విద్యలో సీటు కేటాయించేవారు. పీయూసీ వరకు ఓ మోస్తరు విద్యార్థిగానే ఉన్నారు సుజాత. పీయూసీ సెకండ్ క్లాస్‌లో పాసయ్యారు. స్నేహితులంతా వైద్య విద్యకు దరఖాస్తు చేస్తుంటే తను కూడా చేశారు అనుమానంతో. ఫస్ట్ లిస్ట్ వెలువడింది అనుకున్నట్టుగానే ఆమె పేరు లేదు. సెకండ్ లిస్ట్ వెలువడింది అందులోను లేదు. స్నేహితులంతా కాలేజ్‌ల్లో చేరిపోతున్నారు. ఆమెలో ముందు నుంచీ ఉన్న అనుమానం మరింత బలపడసాగింది. కానీ థర్డ్ లిస్ట్ కేవలం ఒకేఒక పేరుతో వెలువడింది. ఆ ఒకే ఒక పేరు ఎం. సుజాత. వైద్య వృత్తిలోకి వచ్చే వారికి తప్పకుండా ఉండాల్సింది సేవాభావామే అని చెప్పే డాక్టర్ సుజాత పుట్టింది వైద్యుల కుటుంబంలోనే. వారి నాన్నగారైన సీతారామయ్య ఆయుర్వేద వైద్యునిగా పని చేసేవారు. ఆమె పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోని పాత నగరంలోనే. అప్పట్లో ఎంబీబీఎస్‌లో చేరడానికి కావల్సింది 750రూపాయలు. కానీ వారి కుటంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. ఇంట్లో అంత డబ్బు అందుబాటులో లేదు. కానీ వారి నాన్న గారు పక్కింటి పుజారి దగ్గర ఆ ఫీజు డబ్బు అప్పు చేసి మరీ ఆమెను కాలేజ్‌లో చేర్చారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో చేరిన తర్వాత అదృష్టం కొద్ది దేవుడు తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, పూర్తి అంకిత భావంతో చదువు పూర్తి చేసి వీలైనంత ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నారు సుజాత.

మొదటి వైద్యం
చేతిలో ఆఫ్రాన్‌తో బస్‌లో రోజూ కాలేజికి వెళ్లే వారు సుజాత. బస్‌స్టాప్‌లో ఒక పెద్దాయన ఆమెను గమనిస్తుండేవారు. రోజు కనిపించే మనిషి రెండు మూడు రోజులుగా కనిపించడం లేదు. ఒక రోజు బస్‌స్టాప్‌కి ఒక పిల్లాడు వచ్చి ‘అక్కా రోజు మిమ్మల్ని ఇక్కడ చూసే పెద్దాయనకు ఒంట్లో బాగలేదు. ఆయన ఒకసారి మిమ్మల్ని చూడాలని అడుగుతున్నారు. పక్కనే ఉన్న వాళ్లింటికి ఒకసారి రాగలరా’ అని అడిగాడు. సరేనని ఆవిడ వెళ్లేసరికి ఆయన చాలా జబ్బు పడి మంచం మీదే ఉన్నారు. తనకు రోజు ఒక ఇంజక్షన్ చేయించుకోవాల్సి ఉందని ఆవిడ కాలేజ్‌కి వెళుతూ రోజు ఒక సారి వచ్చి ఇంజక్షన్ చేసే సాయం చెయ్యగలరా అని అడిగారట. అలా ఆవిడ ఆయనకు పది పన్నెండు రోజుల పాటు రోజు ఇంజక్షన్ చేశారట. ఆయన కృతజ్ఞతతో కొంత డబ్బు ఇవ్వజూపినా ఆమె సున్నితంగా తిరస్కరించారు. అలా ఆమె విద్యార్థి దశ నుంచే వృత్తిపట్ల అంకిత భావాన్ని, సేవాతత్వాన్ని అలవరచుకున్నారు.

రూరల్ సర్వీస్ తప్పనిసరి
యువ డాక్టర్లంతా తప్పనిసరిగా రూరల్ ప్రాంతాల్లో సేవలు అందించాలని డాక్టర్ సుజాత అంటారు. ‘ఈ రోజుల్లో వైద్యం ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది. అది ఎంత మాత్రం మంచిది కాదు. వైద్యం ఎప్పుడూ సేవగానే ఉండాలి. రెండు మూడు సంవత్సరాల పాటు పల్లె ప్రాంతాల్లో తమ సేవలు అందించిన తర్వాత మాత్రమే వైద్య విద్యార్థులకు పట్టా ఇవ్వాలి. అలా అయితేనే పేద వారికి మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటుంది.’ అంటారామె. ఇప్పుడున్న యువత కనీస బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడి ప్రజాధనంతో చదువు పూర్తి చేసి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిపోతే ఎలా? ఈ ప్రజల బాగోగులు చూసేవారేరి అని ఆవేదన పడ్డారు. అందుకే ఆమె చదువు పూర్తి కాగానే ఉస్మానియా ఆసుపవూతిలో మాత్రమే కాదు, చాలా పల్లెల్లో తన సేవలను అందించారు. జగిత్యాల, వరంగల్ వంటి చిన్న చిన్న పట్టణాల్లో కూడా పని చేశారు. ఆమె వృత్తి జీవితం తొలిదశలో చాలా పల్లెల ప్రజలు ఆమె సేవలో స్వస్థత పొందారు.

టీచింగ్ అంటే చాలా ఇష్టం
కొంత అనుభవం సాధించిన తర్వాత ఆమె ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఆతర్వాత ప్రొఫెసర్‌గా దాదాపు 14సంవత్సరాల పాటు వైద్య విద్యా బోధన చేశారు. నేర్చుకున్న విద్య మనతోఅంతమైపోకూడదు, మనం ఉన్నా లేకున్నా మన విద్య బతికే ఉండాలంటారు డాక్టర్ సుజాత. లెక్కలేనన్ని సెమినార్లు, వర్క్‌షాప్‌లలో పాల్గొన్నారు. ఎన్నొ అంశాల మీద పేపర్లు కూడా సమర్పించారు. నయాపూల్ మెటర్నటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఆమె తన ప్రభుత్వ ఉద్యోగానికి పదవీ విరమణ చేశారు. అనంతరం ఒక పేరు మోసిన కార్పొట్ ఆసుపత్రి నుంచి పెద్ద మొత్తంలో పారితోషకంతో కూడిన ఆహ్వానం కూడా అందినప్పటికీ ఆమె పేదలకు అందుబాటులో ఉండాలన్న ఒకే ఒక సంకల్పంతో ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. సంతోష్‌నగర్‌లోని ఒక చిన్న నర్సింగ్ హోమ్‌లోనే తన సేవలను అందిస్తున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలంటే ట్రైన్డ్ డాక్టర్లు, అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో పల్లెల్లోని ఆసుపవూతుల్లో అందుబాటులో ఉండాలని అభివూపాయపడ్డారు.

అయితే ప్రభుత్వం కూడా అందుకు కొంత తోడ్పాటును అందించాలి. పల్లెల్లో పనిచేసే డాక్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారికి కావల్సిన అన్ని సదుపాయాలు పల్లెల్లో కల్పించాలి. ప్రభుత్వ ఆసుపవూతుల్లో అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారామె. ‘ప్రభుత్వ ఆసుపవూతులకు పేషెంట్ల తాకిడి ఎక్కువ. కాబట్టి అక్కడ పనిచేసే డాక్టర్ల సంఖ్యను కూడా పెంచాలి. సరిపడేంత సిబ్బంది లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపవూతులు మూలపడుతున్నాయి. ఒక్కో డాక్టర్ వందలకొద్ది రోగులను ఒకరోజులో చూడడం దాదాపు అసాధ్యం అందువల్ల ఉన్న సిబ్బంది కూడా మెరుగైన సేవలు అందించలేక పోతున్నారని’ వాపోయారు డాక్టర్ సుజాత.

అంత అవసరం లేదు
ఈ మధ్య చాలా పెరిగిపోయిన హిస్టక్టమి (పెద్దాపరేషన్)ల గురించి అడిగినపుడు ... ‘ఈరోజుల్లో డాక్టర్లకు కొంచెం ఓపిక తగ్గిందనే చెప్పాలి. ఏచిన్న సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లినా వెంటనే గర్భసంచి తొలగించాలని చెప్పి చాలా సందర్భాల్లో అవసరం లేకపోయినా హిస్టక్టమి చేసేస్తున్నారు. నా దగ్గరికి ఇలా హిస్టక్టమి చేయించుకోవాలని వచ్చిన వారిలో 50, 60 మందిలో ఒక నలుగురైదుగురికి మాత్రమే నిజానికి హిస్టక్టమి అవసరమవుతుంది. అది కూడా 40 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే హిస్టక్టమీ చేయాల్సి ఉంటుంది. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి సాధ్యమైనంత వరకు మందులతో చికిత్స చేసే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, మొదటి గర్భం వద్దు అంటూ గర్భం వచ్చాక వచ్చి రకరకాల కారణాలు చూపి తీసేయాలని అడుగుతారు. ఇటువంటి వాటిని నేను అసలు ఎంత మాత్రం ప్రోత్సహించను. ఎందుకంటే మొదటి గర్భం అబార్షన్ చేసినపుడు ఏ చిన్న ఇన్‌ఫెక్షన్ సోకినా ట్యూబ్‌లు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది. వద్దనుకున్నపుడు గర్భం రాకుండానే జాగ్రత్త పడాలి’ అని యువ దంపతులకు సలహా ఇచ్చారు డాక్టర్ సుజాత.

అంకిత భావం ముఖ్యం
డాక్టర్ సుజత పెద్ద కుమారుడు కూడా తల్లి స్ఫూర్తితో వైద్య వృత్తినే చేపట్టారు. మలక్ పేటలోని ఒక నర్సింగ్ హోమ్‌లో పిల్లల డాక్టర్‌గా ఉన్నారాయన. డాక్టర్‌కు కొంతైనా సేవా భావం తప్పనిసరిగా ఉండాలని, వారికి వ్యాపారధోరణి పనికి రాదని, కొంత ఓర్పుతో పేషెంట్లు చెప్పేది వినాలని, వారిని ఎక్కువగా మాట్లాడనీయాలని ఆమె తన తనయుడిని కూడా గైడ్ చేస్తుంటారట. డాక్టర్ సుజాత ఐదుగురు అక్కా చెల్లెళ్లలో నలుగురు డాక్టర్లే అయినా ఒక్కరు కూడా కార్పొట్ ఆసుపవూతుల్లో పని చేయడానికి సుముఖంగా లేరు. ఈరోజుల్లో చిన్నచిన్న సమస్యలకు కూడా చాలా పరీక్షలు చేయించేస్తున్నారు. నాకైతే అలా అసలు ఇష్టం ఉండదు. ముందుగా రెండు మూడు రోజులకు సరిపడే మందులు రాసి పంపితే తర్వాత రోగి పరిస్థితిని బట్టి ఎటువంటి పరీక్షలు అవసరమో అలోచించవచ్చు. కానీ జ్వరం అనగానే ఏ మలేరియాకో, డెంగ్యూకో, టైఫాయిడ్‌కో పరీక్షలు రాయనవసరం లేదని అంటారు డాక్టర్ సుజాత. ఇప్పటి వరకు ఇంత ఫీజు కావాలని ఏనాడు ఏ పేషెంటును తాను అడగలేదు. కొన్ని సందర్భాల్లో మరీ పేదవారైన పేషెంట్లకు నర్సింగ్ హోం ఖర్చులకు కూడా తన సొంత డబ్బు కట్టేవారు. అందుకే చాలా మంది పేషెంట్లు ఆమెను వరాలిచ్చే దేవత అని అంటారు.
Reactions:

0 comments:

Post a Comment

 
Design by Mana Manthani Themes | Bloggerized by avadhanula prasad - Mana Manthani | manthani